ఆరవీడు వీరుడు సోమదేవుడు – హిందువుల స్వాతంత్ర్య పోరాటం

ఆరవీడు వీరుడు సోమదేవుడు – హిందువుల స్వాతంత్ర్య పోరాటం

1326 ప్రాంతంలో కంపిలదేవ రాజు పరిపాలిస్తున్న కంపిలి రాజ్యంపై జీహాద్ యుద్ధం చేయడానికి ముహమ్మద్ ఇబ్న్ తుగ్లక్ తన ఇద్దరు తురుష్క ఘాజీలైన మాలిక్ జాద మరియు మజీర్ అబు రజాలను దండయాత్రకు పంపాడు. మాలిక్ జాద గుజరాత్ నుండి తెచ్చుకున్న తన సైన్యాలతో మరియు మజిర్ అబు రజా దేవగిరి నుండి తెచ్చుకున్న తన సైన్యాలతో కంపిలి పై దాడికి దిగారు. కంపిలి దేవరాజు మరియు ఆయన కుమారుడు, తమ సైన్యాధ్యక్షులు హరిహరరాయలు,బుక్కరాయలు మరియు తమ సోదరులు, సామంతులతో కూడిన సైన్యంతో ఇస్లామిక్ సైన్యాలను అడ్డుకోవడానికి తన బలమైన కోట కుమ్మట నుండి సాహసోపేతమైన పోరాటం జరిపారు. హిందూ సైన్యాలు రెండుసార్లు తుగ్లక్ సైన్యాలను తిప్పికొట్టాయి. కాని మూడవ పర్యాయం తుగ్లక్ సైన్యాల ముట్టడి సుదీర్ఘంగా కొనసాగడం వలన హిందువుల వద్ద ఉన్న వనరులు తరిగిపోయి వారు తమ కోటని వదిలిపెట్టారు. ఆ తర్వాత హొసదుర్గ కోట నుండి వారు తమ పోరాటాన్ని కొనసాగించారు. కాని హొసదుర్గ కోటలో కూడ తగినన్ని వనరులు లేకపోవడం వలన హిందువులు తుగ్లక్ సైన్యాలతో ముఖాముఖి తేల్చుకోవలసి వచ్చింది. ఆ యుద్ధంలో కంపిలిదేవ రాజ మరియు అతని పుత్రుడు హతమార్చబడటంతో పాటు హరిహర మరియు బుక్కరాయలు తుగ్లక్ సైన్యాలకు పట్టుబడి ఢిల్లీ చెరసాలకు పంపబడ్డారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి గడ్డిని కూర్చిన కంపిలిదేవ రాజు తలను బహిరంగంగా ఊరేగించారు. ఈ సమయంలోనే మాలిక్ జాద తన సైన్యాలతో వీరభల్లాల పరిపాలిస్తున్న హోయసల రాజ్యంపై దండయాత్రకు వెళితే పూనే దగ్గర్లోని కోహ్లీ ప్రాంతాలను తుగ్లక్ ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కర్నూలు, అనెగొంది, రాయచూరు మరియు ముద్గల్ ప్రాంతాల మీద జీహాద్ చేయడానికి మాలిక్ ముహమ్మద్ని పంపాడు తుగ్లక్. ఘాజీ ఈ ప్రాంతాలను పట్టుకున్న తర్వాత అక్కడి హిందూ ప్రజలు విచ్చలవిడి ఊచకోతకు గురయ్యారు.

మాలిక్ దండయాత్ర సందర్భంగా జరిగిన అఘాయిత్యాల గురించి విలాస రాగి శాసనం కళ్ళకు కట్టినట్లు ఇలా చెప్పింది :

” ధనం కోసం పలువిధాలుగా గృహస్థులు పీడించబడ్డారు. తురుష్క భూతాలను చూచినంతనే కొందరు తమ ప్రాణాలను వదిలివేసిరి. తమ యఙ్ఞయాగాదులను, పూజలను బ్రాహ్మణులు నిర్వహించలేకపోయారు. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. విగ్రహాలు అపచారానికి గురయ్యి ధ్వంసం చేయబడ్డాయి. అనేక సంవత్సరాలుగా విద్వాంసులైన బ్రాహ్మణుల ఏలుబడిలో ఉన్న అగ్రహారాలు చేదాటిపోయాయి. పండిన పంట తమ చేతికి రాకుండా బలవంతంగా తరలిపోవడంతో ధనికులైనా,పేదలైనా రైతులంతా కష్టాల పాలయ్యారు. ఈ విపత్తు కాలంలో ప్రజలెవ్వరూ తమ భార్యలను గాని, తమ ధనాన్ని గాని మరియు ఇతర భౌతిక వస్తువులనుగాని తమవిగా భావించలేదు. మద్యపానం చేస్తూ, గోమాంసం తింటూ, స్త్రీలను చెరబడుతూ మరియు బ్రాహ్మణులను చంపుతూ దుర్మార్గులైన మహమ్మదీయులు కోలాహలంగా గడిపారు. ఇటువంటి విపత్తులో ఈ జీవ ప్రపంచం ఎలా మనగలదు? కలలోనైనా తమను కాపాడు ఆపద్భాంధవుడిని ఊహించలేక రాక్షసుల వంటి తురుష్క సురత్రాణ సైన్యం చేత ఈ విధముగా హింసింపబడిన తెలుగు నేల బడబాగ్ని చేత చుట్టుముట్టబడిన అరణ్యమువలే ఉండినది”

ఇటువంటి కఠినమైన పరిస్థితులలో అంధ్ర దేశం యొక్క తూర్పు మధ్యభాగములో శూద్రుల నాయకత్వంలో ఒక గొప్ప స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. శూద్ర వీరులైన ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు మరియు ప్రోలయ వేమారెడ్డి హిందువుల ప్రతిఘటన పోరాట బాధ్యతను తీసుకున్నారు. కాని పశ్చిమ తెలుగు నేల మరియు పొరుగు కర్ణాటక ప్రాంతంలో ఈ పోరాట గౌరవాన్ని శూరుడైన సోమదేవుడు చేపట్టాడు. గొంకల దేవి మరియు పిన్నయ్యల కుమారుడైన సోమదేవుడు తాను ఒకటవ పులకేశి యొక్క పురాతన చాళుక్య క్షత్రీయ వంశానికి చెందిన వాడిగా చెప్పుకున్నాడు. వీరి వంశావళి నుండి కొన్ని విషయాలను మనం గ్ర్రహించవచ్చు. క్రీ.శ 500 నాటి వీరి వంశ పురాణం ప్రకారం విస్తృతంగా పరిపాలించగల, గొప్ప యఙ్ఞాలు నిర్వహించగల మరియు భూమిని రక్షించగల సుదీర్ఘ వంశావళిని దేవుడైన కార్తికేయుడు వీరికి వరంగా ఇచ్చాడు. వారి పరిపాలన ఉచ్చస్థితిని దాటిన తర్వాతి కాలంలో చాళుక్యులు అనేక భిన్న వంశాలుగా విడిపోయి భారతదేశమంతటా పరిపాలించారు. వీరి ఉత్తర ప్రాంతపు వంశ శాఖ సోలంకి రాజపుత్ర వంశస్థులుగా రాజస్థాన్ మరియు మధ్య ప్రదేశ్ ప్రాంతాలను పరిపాలించారు. ఫశ్చిమ శాఖలో ప్రధాన వంశం గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలించగా, ఇంకో చిన్న శాఖ కల్యాన్ మరియు కొంకణ్ ప్రాంతాలను పరిపాలించారు. వాతాపి రెండవ పులకేశి చిన్న సోదరుడైన విష్ణువర్ధనుడి నుండి తూర్పు శాఖ పుట్టింది. వాస్తవానికి ప్రధాన సైనిక కేంద్రమైన సతార(ఆధునిక మహారాష్ట్ర; సతారా శాసనం) వద్దనున్న సైన్యానికి విష్ణువర్ధనుడు సైన్యాధిపతి. పల్లవులతో జరిగిన యుద్ధ సమయంలో వాంగీపురానికి పంపబడిన అతడు రాజప్రతినిధిగా అక్కడి నుండి పాలన కొనసాగించాడు. తర్వాతి కాలంలో చోళులతో కలిసిపోయిన ఈ తూర్పు చాళుక్యులు తెలుగు నేలను పరిపాలించిన చాళుక్య-చోళులుగా రూపాంతరం చెందారు. కాని కాకతీయుల ఉత్థానంతో చాళుక్యుల ప్రభ తగ్గిపోయి స్థానిక దండనాయకుల స్థాయికి చేరిపోయారు. ఆ స్థానిక దండనాయకుల వంశం నుండి సోమదేవుడు ఉధ్బవించాడు.

తెనాలి అగస్త్యేస్వర ఆలయ శాసనం ప్రకారం ఓరుగల్లు ప్రతాపరుద్రుని కింద ప్రముఖ దండనాయకులుగా సోమదేవుని వంశస్థులు ఉండేవారు. తాను యువకుడిగా ఉన్నపుడు కాకతీయుల పతనాన్ని మరియు తదనంతరం మహమ్మదీయుల చేత ఆ ప్రాంతంలో జరిగిన విధ్వంసాన్ని కళ్ళారా చూసిన సోమదేవుడు తన పురాతన క్షత్రీయ వంశం పేరును నిలబెట్టేలా జీవించాలని నిర్ణయించుకున్నాడు. మాలిక్ ముహమ్మద్ మీద పోరాడటానికి తన సైన్యంతో పాటు రాయలసీమ హిందువులను సమీకరించిన సోమదేవుడు 6000 సంఖ్య గల బలమైన అశ్విక దళాన్ని ఏర్పర్చగలిగాడు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న ప్రాంతంలో ముస్లింలు పట్టు సాధించడానికి కారణమైన కోటల వరుస మీద ఆకస్మిక దాడులు చేయడం ద్వారా 1331లో  సోమదేవుడు స్వాతంత్ర్య పోరాటాన్ని మొదలుపెట్టాడు. పురాతన శాతవాహన వంశానికి చెందిన చక్రవర్తి శాతకర్ణి ఆధ్వర్యంలో శ్రీశైలం పాంతంలో శాతానికోట నిర్మించబడింది. ఆ కోటను ఆక్రమించుకున్న ముస్లింలు ఆ ప్రాంతంలో చెలరేగే హిందూ ప్రతిఘటనను రెండు సైన్యాల మధ్యన అణిచివేయడానికి ఆ కోటలో సైనిక శిబిరాన్ని ఏర్పరిచారు. కాని ఈ వ్యూహం గురించిన సమాచారాన్ని రెడ్డి మరియు నాయక్ మనుషులు సోమదేవుడికి అందించారు. శాతానికోట మీద రాత్రి సమయంలో మెరుపుదాడి చేసిన సోమదేవుడు  అక్కడి ముస్లిం సైన్యాన్ని ఓడించి తరిమేశాడు. ఆ తర్వాత కర్నూలు ప్రాంతంలో విస్తరించుకొని ఉన్న ముస్లిం దళాలను, వర్తక దండులను ధ్వంసం చేసి తదనంతర పోరాటాలకు అవసరమైన పునాదిని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ప్రథమంగా 7 కోటల యుద్దాన్ని మొదలుపెట్టాడు. మొసలిమడుగు, కందనవోలు, కల్వకొలను, ఈతగిరి మరియు గంగనేనికొండలను చేజిక్కించుకోవడం ద్వారా రెండు నదుల మధ్యనున్న ప్రాంతంలో ముస్లింల సరఫరా మార్గాలను, సమన్వయ అవకాశాలను ధ్వంసం చేశాడు. ఆధారాల ప్రకారం గంగనేనికొండ పోరాటంలో సోమదేవుడు స్వయంగా కోటగోడను ఎక్కి తాను ముందుండి ముస్లిం సైనిక శిబిరం మీద దాడిని నడిపించాడు. ఆ తర్వాత తనను అడ్డుకోవడానికి పంపబడిన ముస్లిం సైన్యాన్ని రాయచూరు వద్ద ఎదుర్కొని ఓడగొట్టి తురుష్కుల బారి నుండి రాయచూరుకు విముక్తి కల్పించాడు. కర్నూలుకు తిరిగి వెళ్తున్న సోమదేవుడిపై  గోసంగి నుండి సైన్యంతో వచ్చిన మజిర్ దాడి చేశాడు. కాని ఆ దాడిని తిప్పికొట్టిన సోమదేవుడు ముస్లిం సైన్యాలను కోటలోకి వెనక్కు తరిమేశాడు. కోటను ముట్టడించిన హిందువులు ఆ తర్వాత కోటలోకి దూసుకెళ్ళారు. మజిర్ తల నరికిన సోమదేవుడు కోటలోని చెరువుకి అధిదేవత అయిన అఘోర భైరవునికి ఆ తలను బలిగా సమర్పించాడు. అటు పిమ్మట, తుగ్లక్ వశమైన అనెగొంది కోటను తురుష్కుల బారి నుండి విడిపించడానికి ముందుకు సాగాడు. ఆ కోట గోడల పైకి రహస్యంగా ఎగబాకి తన సైన్యం కోటలొకి రావడానికి దారి చేసి కోటను ఆక్రమించుకున్నాడు. ఆపై తుగ్లక్ ప్రతినిధి నుండి ముద్గల్ కోటను చేజిక్కించుకొని ఆ పట్టణంలో ఉన్న ముస్లిం సైన్యాలను సంహరించాడు. మాలిక్ ముహమ్మద్ ని లక్ష్యంగా చేసుకొని పోరాటం మొదలుపెట్టిన సోమదేవుడికి చివరగా ఆ అవకాశం రానే వచ్చింది. కంపిలి నుండి ముందుకు వచ్చిన మాలిక్ ముహమ్మద్ సైన్యంతో ముఖాముఖి తలపడ్డాడు. అతని సైన్యం ముస్లిం దళాన్ని ఊచకోత కోసింది. అతని సైన్యం నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన వారు చెల్లచెదరై రెడ్డి, వీరబల్లాల మరియు నాయక్ సైన్యాల చేతిలో బలైపోయారు. మాలిక్ ముహమ్మద్ కూడా బందీగా దొరికాడు. కంపిలి పై తన అధికారాన్ని వదులుకున్న మాలిక్ ముహమ్మద్ ని మూర్ఖంగా ఢిల్లి వెళ్ళనిచ్చాడు సోమదేవుడు. అయినప్పటికి, తన విజయాల అనంతరం సోమదేవుడు ఎక్కువ కాలం జీవించలేదు. కాని సోమదేవుడు నెలకొల్పిన ఆరవీడు వంశం ఆ తర్వాత తమ శౌర్య పరాక్రమాలతో అనేక యుద్దలలో విజయనగర ప్రభువులకు సేవలందించింది. చివరికి, కృష్ణదేవరాయల వంశ తదనంతరం ఆరవీడు వంశానికి చెందిన రామరాయలు విజయనగర పరిపాలకుడు అయ్యాడు.

ద్విపద బాలభాగవత గ్రంథం సోమదేవుడి చరిత్రని చెబుతుంది. ఆ గ్రంథంలో సోమదేవునికి ‘చతుర్దశ పుర నిషూదన ‘(14 కోటలను ధ్వంసం చేసినవాడు) బిరుదు కలదు. ఇంకా ఇలా చెబుతుంది : ” అతడు ఇంద్రుడి వలె గొప్ప శక్తిని కలవాడు. దుర్గమమైన ముస్లిం కోట గోడలను చేధించినవాడు”. అలాగే, సోమదేవుడు తన భార్య కమలాదేవి ద్వారా రాఘవేంద్రుడు అనే పుత్రుడిని పొందాడని ఉంది. రాఘవేంద్రుడు తన భార్య బాచలదేవి ద్వారా పిన్నభూపాల అనే పుత్రుడిని పొందాడు.

తుగ్లక్ మరియు ఖిల్జీలు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించడానికి చేసిన పోరాటంలో శూరుడైన సోమదేవుడు ఆ విధంగా హిందువులను ముందుకు నడిపించాడు.

Translated from: https://manasataramgini.wordpress.com/2005/10/09/somadeva-of-aravidu-and-the-freedom-struggle/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s