ప్రోలయ వేమారెడ్డి – హిందువుల స్వాతంత్ర్య పోరాటం

ఏం జరిగినా సరే హిందూ ధర్మం తట్టుకుంటుందని, తిరిగి పుంజుకునే శక్తి హిందూ ధర్మానికి ఉందని హిందువులు తరచూ చెబుతుంటారు. కాబట్టి హిందూ ధర్మం మీద ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోనవసరం లేదని, ఎవరికి వారు తమ జీవితాలని చక్కదిద్దుకుంటే చాలని, ఏదో ఒక రకంగా, ఏదో ఒక అద్భుతం జరిగి హిందూ మతం తన ఉనికి కాపాడుకుంటుందనే భావన కలుగుతుంది. మరి విదేశీ శక్తులు విధ్వంసం చేస్తూ దోపిడీలలో మునిగి తేలుతుంటే మన అప్పటి పూర్వీకులు కూడా ఏమీ పట్టించుకోకుండా తమ జీవితాలని గడిపేశారా? చరిత్రని పరికిస్తే దానికి భిన్నమైన సమాధానం దొరుకుతుంది. సుమారు వేయి సంవత్సరాల పాటు ప్రతీ స్థాయిలో యుద్దాలు చేయటం ద్వారానే హిందూ ధర్మం తిరిగి పుంజుకొని నిలబడిందన్నది చరిత్ర ఇస్తున్న సాక్ష్యం. హిందూ సన్యాసులు మరియు యుద్దవీరులు కలగలసిన ప్రవాహమే ఈ సనాతన ధర్మం శతాబ్దాల తరబడి నిలదొక్కుకోవడానికి కారణం. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి సల్పిన ఈ పోరు బహుశా ఈ భూ మండలం మొత్తం మీద జరిగిన యుద్దాలలో అతి సుదీర్ఘమైనది. ఏదో ఒక రూపంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

మనం ఈ రోజు హిందువులుగా ఉన్నామంటే దానికి కారణం పూర్వ కాలంలో ఎప్పుడో, ఎక్కడో, ఎవరో మన హిందూ జీవన విధానాన్ని కాపాడటానికి తన జీవితాన్ని త్యాగం చేయడం వలననే. కానీ మన దురదృష్టమేమిటంటే ఎవరెవరు తమ కోసం ఏఏ త్యాగాలు చేశారో తెలియని స్థితిలో నేటి హిందువులు బ్రతుకుతున్నారు. హిందూ చరిత్రలో చోటుచేసుకున్న త్యాగాలు, ధీరత్వాలు మరియు అసామాన్య సాహసాలను స్మరించుకోవడం, ఉత్సవంగా జరుపుకోవడం పక్కనపెట్టి కనీసం గుర్థుపెట్టుకోవడం కూడా జరగటం లేదు. హిందూ నాగరికత ప్రతి దిశలో, దశలో, అడుగులో మరియు ప్రతి పుటలో ఇప్పుడు మనం స్మరించుకోబోతున్న గాథ లాంటివి కోకొల్లలుగా ఉన్నాయి.

1311లో తెలంగాణ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయడానికి అల్లా-ఉద్-దీన్-ఖిల్జీ తన శతృభయంకర ఇస్లాం సైన్యాన్ని తన ప్రియుడు మరియు సైన్యాధ్యక్షుడు మాలిక్ కఫూర్ ఆధ్వర్యంలో పంపాడు. ఈ దండయాత్ర పరమ కిరాతకంగా జరిగింది. హిందూ క్షత్రీయ వంశాలైన కాకతీయులు, చాళుక్యులు మరియు చోళులు గొప్ప శౌర్యంతో పోరాడినప్పటికీ వరంగల్ చుట్టూ జరిగిన యుద్దాలలో ఓడిపోయి చెల్లాచెదరయ్యారు. బ్రతికి బట్టకట్టిన వాళ్ళు కొండపల్లి కోటలో ఆశ్రయం తీసుకొని మహమ్మదీయుల తుఫానును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కాని 1316లో అల్లా-ఉద్-దీన్ చనిపోవడం, గుజరాత్ లో తిరుగుబాటు వలన ఢిల్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం వలన మహమ్మదీయులు తెలంగాణ మీద తమ పట్టును స్థిరపరచుకోలేకపోయారు. దీని ఫలితంగా తీవ్రమైన ప్రాంతీయ అస్థిరత్వం ఏర్పడి ప్రతాపరుద్రుని నాయకత్వంలో కాకతీయులు తిరిగి తమ అధికారాన్ని స్థాపించుకోవడం మొదలుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన అనుభవఙ్ఞుడైన ఘాజీ అల్ మాలిక్ తుగ్లక్ ఢిల్లీలో మహమ్మదీయుల పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత భారత ద్వీపకల్పంలో జరుగుతున్న జీహాద్ యుద్ధాన్ని ఒక క్రమ పద్దతికి తీసుకురావాలని నిర్ణయించాడు.

దక్షిణ భారతదేశంలో దృఢమైన తీవ్రతతో జీహాద్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమర్ధుడైన తన వారసుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ను పంపించాడు. పూణే, దేవగిరి, తెలంగాణ మరియు తొండైమండలాల పై దండయాత్రలకు పూర్తి ప్రణాళికలు రచించిన తుగ్లక్ 1321 నుండి వాటిని అమలుపరచడం మొదలుపెట్టాడు. నాగనాయకుడి చేత వీరోచితంగా రక్షించబడిన పూణాలోని కొండన కోటను ఒక సంవత్సర కాలంలో వశం చేసుకున్న తుగ్లక్ ఆ తర్వాత దేవగిరిని స్వాధీనం చేసుకొని ఆగ్నేయం దిశగా సాగి 1322లో తెలంగాణను చేరుకున్నాడు.

దేవగిరి, ఢిల్లీల నుండి నిరంతరాయంగా అందుతున్న సహకారంతో మహమ్మదీయ సైన్యాలు  సుదీర్ఘంగా, భీకరంగా జరిగిన ముఖాముఖి పోరులో ప్రతాపరుద్రుడి కాకతీయ సైన్యాలను ఓడించారు.

రాజమహేంద్రవరం కోటను నలుదిక్కుల నుండి భారీ ఇస్లాం సైన్యాలు చుట్టుముట్టి దాడి చేయడంతో వారు రక్షణలో పడిపోయారు. వారు ఆరు నెలలపాటు కోటను కాచుకున్నప్పటికీ చివరికి మహమ్మదీయ సైన్యాలు కోటలోకి ప్రవేశించి కోటను రక్షిస్తున్న వారందరిని ఊచకోత కోశారు. ప్రతాపరుద్రుడిని మరియు అతని కుటుంబాన్ని పట్టుకొని ఢిల్లీకి పంపారు. కానీ ఢిల్లీకి చేరితే ఇస్లాం మతంలోకి మారవలసిన అగత్యం పడుతుంది కాబట్టి అందుకు బదులు ప్రతాపరుద్రుడు తనను తానే చంపుకున్నాడు. చాళుక్యులు నిర్మించిన ఘనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని కూల్చిన తుగ్లక్ ఆ శిధిలాలతోనే మసీదును నిర్మించాడు. దీనితో తెలంగాణలో క్షత్రీయుల ఉనికి పోయి ఇస్లాం సైన్యాలు ఆ భూమిని భయోత్పాతానికి గురిచేశాయి.

1325లో ధర్మ రక్షణను నిర్వహించే బాధ్యతను శూద్ర యుద్దవీరుడైన ప్రోలయ వేమారెడ్డి తన భుజానికి ఎత్తుకున్నాడు. ఒక స్థానిక దండనాయకుని కుమారుడైన వేమారెడ్డి ‘శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిన నాలుగవ వర్ణమైన శూద్రులలో తాను ఒకడిగా’, క్షత్రీయుల తర్వాత బ్రాహ్మణులు మరియు అగ్రహారాల రక్షణార్థం ఈ భూమి మీద నుండి తురుష్కుల పీడ విరగడ చేయడానికి సంకల్పించిన వ్యక్తిగా తనను తాను  వర్ణించుకున్నాడు.

యుద్ధ దేవుడైన కుమారస్వామి మరియు తన నాలుగవ వర్ణం లాగానే శ్రీ మహావిష్ణువు పాదాల నుండి పుట్టిన తన ఇంటి దేవత గంగమ్మల నుండి స్ఫూర్తి పొందిన వేమారెడ్డి ధ్వంసమైన ఆయా ప్రాంతాల నుండి సమీకరించిన రైతులు, కాపరులతో ఒక పెద్ద సైన్యాన్ని తయారుచేశాడు.పశువుల కోసం జరిగే ఘర్షణలలో ఎప్పటి నుండో ఆరితేరిన ఆయన వంశం ఆకస్మికంగా దాడి చేసి నష్టం కలిగించి పారిపోయే(గెరిల్లా) యుద్ధతంత్ర పద్దతులలో అపార నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ప్రొలయ వేమరెడ్డి ఇతర ప్రముఖ స్థానిక యుద్ధవీరులైన ప్రోలయ నాయకుడు మరియు కాపయ నాయకులతో చేతులు కలిపాడు. వారు సుమారు 75 మంది స్థానిక యుద్ధవీరులు మరియు బలం కలిగిన వ్యక్తులతో కలిసి ఒక కూటమిని ఏర్పరిచారు. అద్దంకి వద్ద తన హిందూ సైన్యాన్ని సమీకరించిన వేమారెడ్డి తుగ్లక్ సైన్యాల మీదకు దండయాత్ర మొదలుపెట్టాడు.

ఈ యుద్ధంలో జీవసంబంధ యుద్ధతంత్రాన్ని వాడిన రెడ్లు మహమ్మదీయ సైన్యాల వద్దకు ప్రవహిస్తున్న నీళ్ళలో మురికి నీటిని కలిపి కాలుష్యం చేశారు. ఈ నీటిని సేవించిన తుగ్లక్ సైన్యానం తీవ్ర విరేచనాల బారిన పడి క్షీణించిపోయింది. స్వయంగా తుగ్లక్ అనారోగ్యం పాలయ్యి తిరుగుముఖం పట్టాడు. ముస్లింలు ఈ విధంగా అల్లకల్లోలంలో ఉండగా వారి మీద పడిన హిందూ సైన్యం వరంగల్ శివారులలో జరిగిన ముఖాముఖి పోరులో మిగిలిన వారిని నలిపేసి పని పూర్తి చేసింది. తుగ్లక్ సైన్యం వదిలివెళ్ళినా హిందూ పరిపాలనను తిరిగి స్థాపించడానికి స్థానిక ముస్లిం ఆమిర్లు మరియు ముస్లిం వర్తకులు అడ్డం అవుతారని వేమారెడ్డి అర్థం చేసుకున్నాడు. వరుస దాడులతో వారి వర్తక వ్యవస్థలను, చిన్న సైనిక దండులను మరియు ఆ భూప్రాంతమంతా విస్తరించుకున్న ఇస్లామిక్ ఆయుధగారాలను ధ్వంసం చేసి నిర్మూలించాడు. ముస్లిం సైన్యాల కేంద్ర స్థానమైన దేవగిరి నుండి జరుగుతున్న దాడులను కాచుకోవడం ద్వారా వీరభల్లాల ఈ ప్రక్రియలో హిందూ కూటమికి సహాయపడ్డాడు.

1335లో తెలంగాణాలో హిందూ పునరుత్థానాన్ని నిర్మూలించడానికి మక్బూల్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఒక పెద్ద సైన్యాన్ని ముహమ్మద్ బిన్ తుగ్లక్ పంపాడు. కాని వీర భల్లాల పంపిన సహాయక సైన్యాలతో కూడిన రెడ్డి మరియు నాయక్ సైన్యాలు ఆ యుద్ధక్షేత్రంలో 15 మంది ముస్లిం ఆమిర్లను చంపేసి తుగ్లక్ సైన్యాలను ఘోరంగా ఓడించాయి. ఇక్బాల్ మరియు అతని సైన్యాన్ని వేమరెడ్డి వెంబడించగా వారు వరంగల్ కోటలోకి పారిపొయి తల దాచుకోగా కాపయ నాయకుడు కోటను తన సైన్యాలతో ముంచెత్తాడు.

ఆ తర్వాత వేమారెడ్డి కొండవీడు కోట మీదకు తన సైన్యాలతో దండెత్తి ముఖ్య సేనానాయకుడు మాలిక్ గుర్జార్ని వధించాడు. ఆ తర్వాత జరిగిన ముఖాముఖి పోరులలో నిడదవోలు, ఉండి మరియు పిఠాపురాలను విడిపించాడు. ఆ తర్వాత తొండైమండలం పై చేసిన దాడిలో ఒక వైపు స్వయంగా సుల్తానుతో వీరభల్లాల తలపడుతుండగా జలాల్-ఉద్-దిన్ షా సైన్యాన్ని వేమారెడ్డి ఊచకోత కోయించాడు.

కాని, మదురై మరియు ఢిల్లీ సుల్తానులతో సుదీర్ఘంగా జరిగిన యుద్ధంలో వీరభల్లాల చివరికి ముస్లింల చేతికి చిక్కాడు. ఆయన బ్రతికి ఉండగానే ఆయన చర్మాన్ని ఒలిచి మదురై గోడకు ఆ ఎండు చర్మాన్ని వేలాడదీశారు(ఆ తర్వాతి కాలంలో ఇబిన్ బట్టూటా దీన్ని చూశాడు). అయినా భయపడని వేమారెడ్డి బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జునకొండ కోటలలో ఉన్న ముస్లిం ఆయుధగారాల మీద వరుస దాడులు చేసి వాటిని రక్షిస్తున్న వారిని తెగనరికి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.

కొండవీడు కోట మీద తన పతాకాన్ని ఎగురవేసి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఆయన శాసనాలలో ప్రకటనలు :

” దుష్టులైన తురుష్క రాజుల చేత తీసుకుపోబడిన బ్రాహ్మణ అగ్రహారాలను నేను పునఃనిర్మించాను”. ” తురుష్కులతో నిండిన సముద్రానికి నేను అగస్త్యుడి వంటి వాడిని”.

శ్రీశైల రుద్ర దేవాలయానికి మరమ్మత్తులు చేయించడంతో పాటుగా కొండ మీద వున్న దేవాలయం నుండి కింద వున్న కృష్ణా నది వరకు మెట్ల వరుస నిర్మించి ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. అహోబిళంలో విష్ణువు దేవాలయానికి మరమ్మత్తులు చేయించాడు. వేమారెడ్డి ధర్మాన్ని కాపాడటం వలన స్థానిక సాహిత్యం,కళలూ తిరిగి పుంజుకున్నాయి. ముఖ్యంగా వత్స భార్గవ భ్రాహ్మణుడైన ఎఱ్రాప్రగడ(ఎర్రన) ఆధ్వర్యంలో సాహిత్యం తిరిగి పుంజుకుంది.ఆయన రచించిన రామాయణం ఒక కళాఖండం. యుద్దలలో ముస్లింల నుండి తాను పొందిన మహిళల కోసం వేమారెడ్డి కొండవీడులో అంతఃపురాన్ని నిర్మించాడు. తర్వాతి రెడ్డి రాజుల విలాసమందిరంగా ఇది కొనసాగింది.

ఆయన వారసుడు అనవేమారెడ్డి ఇస్లాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరును కొనసాగించాడు. రాజమహేంద్రవరాన్ని విడిపించి అక్కడ హిందూ మందిరం స్థానంలో నిర్మించిన మజర్ని కూల్చివేయడంతో మొదలుపెట్టాడు. ఒక చిన్న దండుతో కోరుకొండ కోటను ఎక్కి అక్కడ ఉన్న ముస్లిం సైనికశిబిరాం నుండి కోటను విడిపించాడు. ఆ తర్వాత సింహాచలం కోటను మరియు కొన్ని కలింగ రాజ్య భాగాలను ఆక్రమించుకున్నాడు. తన శాసనంలో ఇలా ప్రకటించాడు : ” నాలుగవ వర్ణపు శూద్ర వీరుడనైన నేను తురుష్క సమూహాలను సంహరించి ఈ సభలో పండితులైన బ్రాహ్మణులను పోగుచేశాను”. శ్రీశైలం గుడిలో వీరశిరోమండపాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో మరో ఇద్దరు గొప్ప హిందూ వీరులు కృష్ణదేవరాయలు మరియు శివాజీలు కూడా శ్రీశైల మందిరానికి మరమ్మత్తులు చేయించారు.

ఖిల్జీ-తుగ్లక్ కాలాల తర్వాత స్థానికంగా జరిగిన అనేక హిందూ ప్రతిఘటన చరిత్రలలో మనం మరచిన గాథలు కోకొల్లలు. అందులో తెలుగు నేల విమోచన పోరాటం కూడా ఒకటి.

Translated from: http://www.hinduhistory.info/prolaya-vema-reddy-rise-of-the-warrior-king/

Advertisements

4 thoughts on “ప్రోలయ వేమారెడ్డి – హిందువుల స్వాతంత్ర్య పోరాటం”

  1. Hi,

    I’d like to get in touch with the person who tweets under the name Rjrasva. Can I have his email address?

    Thanks
    K

  2. very happy that you are getting some good articles translated into regional languages like telugu and posting them. it is essential that such activity is taken up by more and more people. unless we create good reading material in regional languages, no amount of english stuff can bring the desired result, namely, awareness among hindus. for my part i keep writing in telugu. by the way the telugu word for guerrilla war is maaTu yuddhamu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s